Chintamaneni Prabhakar: పోలీసుల తీరుపట్ల టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 3న తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు రక్తదాన శిబిరం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు చింతమనేని ప్రభాకర్ వెళ్లగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తన చొక్కా చింపివేశారని ప్రెస్‌మీట్‌లోనే చింతమనేని ప్రభాకర్ తన చొక్కా విప్పి చూపించారు. అత్యుత్సాహంతో తన చొక్కా చింపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చింతమనేని హెచ్చరించారు. ఇప్పటికే తనపై 31 కేసులు పెట్టారని.. మరిన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చింతమనేనికి పట్టిన గతి పడుతుందని తనను ఉదాహరణగా చూపాలని ఈ ప్రభుత్వం అనుకుంటోందని ఆరోపించారు. తన బట్టలు చించిన పోలీసులకు రేపు బట్టలుంటాయా అని ప్రశ్నించారు.
Read Also: రక్తం చిక్కబడకుండా, వీన్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..!
ఆశ్రమ కళాశాలలో పిల్లల ఫీజులు ఎలా కట్టారో తమకు తెలియదా అని చింతమనేని ప్రభాకర్ విమర్శలు చేశారు. దీనికి సంబంధించి అన్ని వివరాలు త్వరలోనే బయట పెడతామన్నారు. జగన్ తాత దిగొచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్నారు. తానేం చేశానని చొక్కా చించారో చెప్పాలని చింతమనేని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని.. న్యాయం కోసం చివరి వరకు పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ తన పట్ల దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం తప్పా అని నిలదీశారు. జోగయ్య అదే ఆస్పత్రిలో ఉన్నారనే వంకతో తనను లోపలకు వెళ్లనీయకుండా ఆపేశారన్నారు. హరిరామ జోగయ్యను పరామర్శిస్తే తప్పేంటని చింతమనేని ప్రభాకర్ నిలదీశారు.