మేడారం సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి అవమానంగా మాట్లాడారని వచ్చిన వార్తలపై మండిపడ్డారు అహోబిల రామానుజ స్వామీజీ. కొంత మంది ఈర్ష్య అసూయలతో ఉన్నారు. హిందూ ధర్మంలో సమతా మూర్తి విగ్రహం ఆవిష్కరణ వంటి పెద్ద కార్యక్రమం జరిగిన తర్వాత ఈ రకమైన వివాదం రావడం బాధాకరం. హిందూమతానికి చెందిన వాళ్లే ఈ తరహా ప్రచారం చేయడం మరింత బాధ కలిగిస్తోంది.
ఓ సినీ ప్రముఖుడు.. స్వామి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం సరి కాదు. స్వామి వారు ఎప్పుడో చెప్పిన వ్యాఖ్యానాలను ముందూ వెనుకా కత్తిరించి ఇప్పుడు ప్రచారంలో పెట్టారని విమర్శించారు అహోబిల రామానుజస్వామి. అంతకుముందు మీడియాతో మాట్లాడిన చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ అవమానించలేదని, చిన్నచూపు చూడలేదన్నారు. చెట్టు, గుట్ట అన్నీ పూజనీయమైనవే. మన సంప్రదాయం చాలా గొప్పది. ప్రకృతిని.. ప్రాణకోటిని గౌరవించడం మన బాధ్యత. 20 ఏళ్లకు పూర్వం మాట్లాడిన దాన్ని కట్ చేసి వేశారు. మనుషుల్లో ఉండే వ్యక్తులకు దైవత్వాన్ని కలగచేశారనే భావంతో మాట్లాడాం. గ్రామ దేవతల్లో చాలా మంది మహిళలు చక్కటి నాలెడ్జ్ కలిగినవారు.
గ్రామ దేవతలు స్వర్గం నుంచి వచ్చిన దేవతలు కాలేదు. మనుషులుగానే ఉంటూ ఆరాధ్యనీయులయైన మహిళలు గ్రామ దేవతలు. అలాంటి గ్రామ దేవతలను మన మధ్య పెట్టుకుని అసాంఘిక కార్యక్రమాలు చేయడం సరి కాదని నేను చెప్పాను. ఇప్పుడు మాట్లాడే వారు.. ఈ విషయాలని గమనిస్తున్నారు. రాజకీయాలతో మాకు చాలా దూరం. మాకూ అందరూ సమానమే అని వివరించారు చినజీయర్ స్వామి.