ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాల అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 26 జిల్లాలపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు విముఖతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ గా భేటీ నిర్వహించారు. ఈ భేటీలో కొత్త జిల్లాల ప్రక్రియను సీనియర్ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతుందని సీనియర్ నేతలు చంద్రబాబుకు వివరించారు.
అంతేకాకుండా క్యాసినో వ్యవహారం ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ అని సీనియర్ నేతలు చంద్రబాబుకు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా టీడీపీ మాత్రం స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకునే వరకు క్యాసినో వ్యవహారంలో టీడీపీ పోరాటం చేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాల నాటకానికి తెర లేపిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.