చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన మినీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని తిరిగి కాపాడుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీకి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. లేని సమస్యలు సృష్టించి మరీ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తాను సభ రాకుండా అక్రమ కేసుకు పెడుతారా.. వైసీపీ దొంగల్లారా… తాను కనుకగా కన్నెర్ర చేస్తే ఇంటిలో నుండి బయటకు కూడా రాలేరన్నారు. తాను అనుకుంటే జగన్ రోడ్డు మీద పాదయాత్ర చేసేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. అప్పుడు ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని ఆరోపించారు. తాను సాఫ్ట్‌వేర్, టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తే… జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడని చురకలు అంటించారు. జగన్ ఎక్కడ చదివాడో ఎవరికీ తెలియదని.. మళ్లీ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చెప్పగలరా… జగన్ ఎక్కడ చదివాడో అని చంద్రబాబు సూటిగా నిలదీశారు. తాను ఎస్వీ యూనివర్శిటిలో ఎంఏ ఎకనామిక్స్ చదివానని చంద్రబాబు తెలిపారు.
అమ్మ ఒడి పేరుతో తల్లులను సైతం జగన్ మోసం చేస్తున్నాడని.. అమ్మ ఒడి ఒక నాటకం …. ఇంగ్లీషు మీడియం ఒక భూటకం అని చంద్రబాబు విమర్శించారు. పదో తరగతి పిల్లల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే విద్యార్థులు మరణించారని ఆరోపించారు. ఏపీలో జగన్ 8 వేల స్కూల్స్ మూసివేస్తున్నాడని.. విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తున్న ఘనత జగన్‌కే దక్కిందని మండిపడ్డారు. ఏ గ్రామంలో స్కూల్ మూసివేస్తారో ఆ గ్రామంలో వైసీపీ నేతలను రాకుండా బహిష్కరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. స్కూల్స్ మూసివేయకూడదని మహానాడులో తీర్మానం ప్రవేశపెడతామన్నారు.
బస్సు ఛార్జీలు పెంచారని.. గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకులు అన్నింటిమీదా ధరలు పెంచి బాదేస్తున్నారని చంద్రబాబు కౌంటర్లు వేశారు. మద్యంలో కెమికల్స్ కలిపి నాసిరకం మద్యం అమ్ముతున్నారంటూ ప్రైవేట్ ల్యాబ్ ద్వారా నివేదికలు వచ్చిన సంగతిని ప్రస్తావించారు. కొత్తగా ప్రొఫిషనల్ టాక్స్ అంటూ మరో బాదుడికి జగన్ రెడ్డి సిద్ధం అవుతున్నాడని.. చేతి వృత్తులు, జాబ్ చేసే వారే మీదా రూ.5వేల కోట్ల భారం వేయబోతున్నాడని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పెట్టిన కేసులన్నీ చిత్రగుప్తుడిలా లెక్కలు రాస్తున్నానని.. అన్నీ రిటర్న్ ఇస్తానని చంద్రబాబు హెచ్చరించారు. కాగా అంతకుముందు మదనపల్లి చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు హారతులతో ఘనస్వాగతం పలికారు.