Chandrababu Naidu Speech At Kurnool Yemmiganur Public Event: ప్రస్తుతం కర్నూలు పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తాజాగా ఎమ్మిగనూరు తేరు బజారులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే తన పర్యటన విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు. ధరలన్నీ పెరిగాయని, రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. తమపై ఎక్కడ కేసులు పెడతారన్న భయంతో.. ఎన్ని సమస్యలున్నప్పటికీ ప్రజలు తమ బాధలు చెప్పుకోలేక పోతున్నారన్నారు. ప్రజల ఖాతాలోకి డబ్బులు వేసేందుకు నెలకోసారి బటన్ నొక్కే జగన్.. తన ఖాతాలోకి డబ్బులు పడేందుకు మాత్రం రోజూ బటన్ నొక్కుతున్నారన్నారు. ప్రైవేట్ మద్యం డిస్టీలరీస్ అన్నీ జగన్ లాక్కున్నారని ఆరోపించారు. దిష్టిబొమ్మల్లా ప్లకార్డులు పట్టుకొని, తనకు నిరసన తెలుపుతూ నిలబడ్డారన్నారు. గులకరాళ్లు వేస్తే పారిపోయే వ్యక్తిని తాను కాను అని, ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. రోడ్ షోలో చిన్న పిల్లలను భుజాన ఎత్తుకొని మరి ప్రజలు బయటకు వస్తున్నారన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తాను తలిస్తే.. ముద్దులకు మురిసిపోయి అప్పట్లో వైసీపీకి ఓట్లు వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. సొంత ఆదాయం కోసం మద్యం ధరలు పెంచారని, ఇలాంటి సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. వ్యవస్థలను నాశనం చేస్తూ.. గ్రానైట్, క్రషర్లు, పరిశ్రమలన్నీ జగన్ తీసుకున్నారని ఆరోపించారు. జిల్లాలో అప్పుల మంత్రి హరికథలు బాగా చెప్తారని, ఇంకొకరేమో బెంజి కారు మంత్రి అని సెటైర్లు వేశారు. బెంజి మంత్రి కర్ణాటక మద్యం వ్యాపారం, భూకబ్జాలు చేస్తారని ఆరోపణలు చేశారు. తాను అధికారంలో ఉండి ఉంటే, 2020లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేవాడినన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని తాము తీర్మానం చేసి ఢిల్లీకి పంపామని, ఇప్పుడు ఆ విషయంపై జగన్ మళ్లీ కమిటీ వేశారని చెప్పారు. 20 ఏళ్ల క్రితం తాను సెల్ ఫోన్ల కోసం ప్రమోట్ చేశానన్నారు. అన్న క్యాంటీన్ మూసివేసి పెద్దవాళ్ళ కడుపు కొడుతున్నారని విమర్శించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కనిపించడం లేదని, ఆయనపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాలని కోరారు. తాను ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్క్‌కు 93 ఎకరాల్ని మంజూరు చేశానని, దాన్ని కూడా కొట్టేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థలను సీఎం జగన్ నిర్వీర్యం చేశారన్నారు.
ఇది అసెంబ్లీ గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చంద్రబాబు మరోసారి వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో గెలిచి, ఆ కౌరవ సభను గౌరవ సభగా మార్చి, సీఎంగా అసెంబ్లీలో అడుగుపెడతానన్నారు. ఇక వివేకానంత రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత ఒక్కతే పోరాటం చేస్తోందని, ఆయన హత్యపై నారాసుర హత్య అని రాశారని చెప్పారు. వివేకానంద హత్యపై వేరే రాష్ట్రంలో విచారణకు సునీత పోరాడిందని గుర్తు చేశారు. వివేకానంద కుమార్తె సునీతను అభినందించాలి వెల్లడించారు.