వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కనిగిరికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు… ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నదుల అనుసంధానం చేసి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని.. కానీ, పక్క రాష్ట్రంతో గొడవపడి హక్కులన్ని కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు. కాల్వలు తవ్వాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. పోలవరం నిధుల కోసం కేంద్రాన్ని అడిగే దమ్ము.. ధైర్యం ఈ సీఎంకు లేదంటూ సీఎం వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు.
ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్న చంద్రబాబు.. ప్రభుత్వం చేస్తున్న అప్పులు వాళ్ల సొంత జేబుల్లోకి పోతున్నాయే తప్ప.. సంక్షేమం కోసం కాదు అని ఆరోపించారు. అమరావతిని అభివృద్ధి చేస్తే రూ.2 లక్షల కోట్ల సంపదను ఈ ప్రభుత్వం కుక్కల పాలు చేసిందని మండిపడ్డ టీడీపీ అధినేత… పార్టీ కోసం ఇప్పటి నుంచి పని చేసే ఇంఛార్జ్‌లకే టిక్కెట్లు ఇస్తామని.. చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం పని చేయని వారిని పక్కన పెట్టేస్తామని వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.