ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో గుంటూరు పార్టీ కార్యాలయంలో భేటీ నిర్వహించనున్నారు. ఇవాళ 12 నియోజకవర్గాల ఇన్ఛార్జులతో చంద్రబాబు సమావేశం జరగనుంది. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు 12 మందితో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనులో సమావేశం జరుగుతుంది. గత రెండు, మూడు రోజులుగా పార్టీ కార్యాలయంలో జిల్లాలవారీగా సమీక్షలు చేస్తూ.. కొత్త ఇంఛార్జ్‌లను నియమిస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు నేడు సమావేశంకానున్నారు.
ఈ సమావేశానికి గంటా, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబులు సమావేశానికి రావాలని అధిష్టానం కోరింది. సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వస్తారో రారోననే ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును విడిగా కలుస్తానని పార్టీకి గంటా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. చాలా కాలంగా పార్టీకి దూరంగా వుంటున్నారు గంటా. గత ఏడాది వైసీపీలో చేరతారనే సంకేతాలు వినిపించాయి. కానీ ఎందుకో మరి గంటా మౌనంగా వున్నారు. పార్టీల మార్పు గురించి ఎన్ని ఊహాగానాలు వచ్చినా గంటా మాత్రం మౌనంగా వుండి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాల లేఖను ఏకంగా స్పీకర్‌కు పంపించారు. మళ్లీ కొద్దిరోజులుగా గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది.
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు ఇప్పటికే భేటీ అయ్యారు. కందుకూరు నియోజకవర్గానికి ఎవరిని ఇంచార్జిగా నియమించాలనే దానిపై సుదీర్ఘంగా నేతల అభిప్రాయం తీసుకున్న చంద్రబాబు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. మూడు నాలుగు రోజుల్లో బలమైన నేతను ఇంచార్జి గా నియమిస్తామని నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంచార్జి పదవి ఆశిస్తున్న వారిలో ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్, కంచర్ల శ్రీకాంత్ వున్నారు. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. పోటీకి ఆసక్తిగా లేకపోవడంతో కొత్త వారి కోసం చూస్తున్న టీడీపీ అధిష్టానం సరైన నాయకుడి కోసం అన్వేషిస్తోంది. అదే విధంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఇవాళ రెండోరోజు సర్పంచ్ లకు అవగాహన సదస్సు జరుగుతుంది. కొత్త సర్పంచ్ లకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ప్రకాశం, నెల్లూరు, తూ.గో జిల్లాల నుంచి గెలుపొందిన సర్పంచ్ లు ఈ సమావేశానికి హాజరవుతారు.