టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో కోత విధించిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా సజ్జల ఉద్యోగుల్ని బెదిరించారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీల్లో ఈ ప్రభుత్వం కోత విధించడం సీఎం పెద్ద మనస్సుకు నిదర్శనమా? అల్ప బుద్ధికి నిదర్శనమా? అని ఆయన ప్రశ్నించారు. కరెంటు కోతలు వెంటనే నివారించాలని, విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలని, డిస్కమ్‌లకు ప్రభుత్వ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వీటితో పాటు పాఠశాలల విలీనం రద్దు చేయాలని, పెంచిన సిమెంటు ధరలు తగ్గించాలని ఆయన అన్నారు. భారతి సిమెంటు ప్రయోజనాల కోసం భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీయరాదని, టీడీపీ పాలనలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్దిదారులకు స్వాధీనం చేయాలన్నారు. హైకోర్టు తీర్పు రిజర్వులో ఉన్నప్పుడు రాజధాని భూములు తనఖా పెట్టడం చట్ట విరుద్ధం కాదా? అని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుల కోసం అమరావతిలోని సుమారు 480 ఎకరాలను బ్యాంకుకు తనఖా పెట్టడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.