Central Government answer on special package to andhra pradesh: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఇటీవల పార్లమెంట్‌లో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రత్యేక ప్యాకేజీపై కీలక ప్రకటన చేసింది. ఏపీకి 2016లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇప్పటివరకు 17 ప్రాజెక్టుకు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి రూ.7,797 కోట్ల రుణం అందించామని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు ఈ విధంగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ఈ అప్పులపై కేంద్రం 2015-16 నుంచి 2018-19 వరకు వడ్డీ కింద రూ.15.81 కోట్లు చెల్లించినట్లు పంకజ్ చౌదరి వివరించారు. ఏపీకి పార్లమెంట్ సభాముఖంగా ఇచ్చిన విభిన్న హామీలు, 14వ ఆర్ధిక సంఘం సిఫారసులు, రాష్ట్ర అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రత్యేక మద్దతు చర్యల కింద ప్యాకేజీని ప్రకటించిందని పంకజ్ చౌదరి తెలిపారు.
Read Also: Electricity bill: ఓ ఇంటికి రూ.3,419 కోట్ల కరెంట్ బిల్లు.. ఆస్పత్రి పాలైన యజమాని
కాగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం 17 ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌లకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. పార్లమెంట్‌లో ఇచ్చిన వివిధ హామీలు, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు, కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అవసరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2015 మార్చి 15న ఈఏపీ నిధులతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల జాబితాలో విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్ట్ (రూ. 1859 కోట్లు), ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసే ప్రాజెక్ట్ (రూ. 935 కోట్లు), ఆంధ్రప్రదేశ్ పవర్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ (897 కోట్లు), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (825 కోట్లు) ఉన్నాయి.