Andhra Pradesh: కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అతి తక్కువ సమయంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ అన్నారు. గుడ్ గవర్నెన్స్ అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని.. ప్రస్తుతం ఏపీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సమర్ధుడు కాదని విమర్శలు చేశారు. గ్రామీణాభివృద్ధికి 14, 15వ ప్రణాళిక సంఘం నిధులను ప్రభుత్వం వేరే మార్గంలో వాడుకుందని ఆరోపించారు. దీనిపై సర్పంచ్‌లు తనకు వినతిపత్రాలు ఇచ్చారని చెప్పారు. ఇది గ్రామ స్వరాజ్యంపై దాడిగా చౌహాన్ అభివర్ణించారు.
Read Also: Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ..ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు
అటు ఏపీలో ఇకపై ప్రతి నెల ఒక కేంద్రమంత్రి విజిట్ చేస్తారని దేవుసిన్హ్ చౌహాన్ వెల్లడించారు. పంచాయతీలకు ఇచ్చే నిధులు గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బంది జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లను జీతాలు ఇస్తున్నారని.. కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్నాడు. వాలంటీలర్లకు ప్రభుత్వ నిధులు పంచుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్లు సేవ చేయడం లేదని.. ఇతర పార్టీలను అణచి వేసేందుకు వాలంటీర్లను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదన్నారు. ప్రభుత్వ విధులు నిర్వహించడంలో వాలంటీర్లు విఫలమవుతున్నారన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదని కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ జోస్యం చెప్పారు. 20 లక్షల గృహాలను కేంద్రం ఏపీకి మంజూరు చేసిందని.. కానీ ఇక్కడ ఒక్క ఇల్లు నిర్మించడం లేదన్నారు. మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేరని..కేంద్రం ఏపీ ప్రజలకు మంజూరు చేసే నిధులు సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. ఆయుష్మాన్ కార్డు పేదలకు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధి, రాష్ట్రం చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్లముందే కనిపిస్తుందని.. ఏపీలో ప్రతి వ్యక్తికి సాయం చేయడానికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారన్నారు.