ఆనందయ్య మందుకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతిలోని ఆయుర్వేద కళాశాలలో పరిశోధన కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య దగ్గర మెడిసిన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు వైద్యలు. నిన్నటి రోజున 190 మందికి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. అయితే, ఫోన్ ద్వారా వివరాలు సేకరించే సమయంలో వైద్యులకు సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. కొంతమంది రోగులు స్థానిక ఆరోగ్యకార్యకర్తల నెంబర్లు ఇచ్చినట్టు వైద్యుల దృష్టికి వచ్చింది. కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా మందు తీసుకున్న వారే ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా వచ్చిన తరువాత మందు తీసుకొని ఉంటే, ఫలితాలు తెలుసుకునే వీలుంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మరిన్ని ఫోన్ నెంబర్లు సేకరించి పంపించాలని నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని ఆయుర్వేద వైద్యులు కోరారు. కరోనా వచ్చి మందు తీసుకున్న వారు కనీసం 500 మందిని విశ్లేషిస్తేనే మందు ప్రభావంపై ప్రాథమిక నిర్ధారణ చేయవచ్చని అంటున్నారు.