Fake Lawyers: న్యాయవ్యవస్థలోనూ నకిలీలు చొరబడ్డారు.. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి న్యాయవాదులుగా చలామణి అవుతున్నారు.. ఇప్పుడు ఈ వ్యవహారం పల్నాడులో కలకలం రేపుతోంది.. విద్యార్హతలు లేకపోయినా.. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి న్యాయవాదులుగా చలామణీ అవుతున్నారు. చట్టం, ధర్మం, న్యాయాలను పరిహసిస్తున్నారు. చట్టంపై ఏ మాత్రం అవగాహన లేని వీరు కక్షిదారులను మోసం చేస్తున్నారు. న్యాయవాదుల వద్ద కొందరు గుమాస్తాలుగా చేరి.. కోర్టుల్లో కేసులకు సంబంధించిన విధివిధానాలపై అవగాహన పెంచుకుని.. ఆ తర్వాత నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా మారి కోర్టులనే మోసం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. సత్తెనపల్లికి చెందిన బిక్కి నాగేశ్వరరావు, మాచర్ల వెంకటేశ్వరరావు సహా ఏడుగురిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా కొనసాగుతున్నారని ఆరోపణలతో ఈ ఫిర్యాదు అందించింది.. నకిలీ న్యాయవాదుల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మలత.. వీరిపై ఐపీసీ 120 బీ 420, 467, 468, 471 రెడ్ విత్ 34 సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు తుళ్లూరు పోలీసులు.
Read Also: Gopichand Malineni : తన నెక్ట్స్ మూవీ కోసం కసరత్తు చేస్తున్న బాలయ్య డైరెక్టర్
ఇటీవల ఓ కోర్టులో నకిలీ న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా మేజిస్ట్రేట్‌కు అనుమానం వచ్చింది. విద్యార్హత, న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన వివరాలు అడగడంతో అతడి గుట్టు రట్టు అయినట్టు తెలుస్తోంది.. నకిలీలపై ఫిర్యాదులు అధికం కావడంతో స్పందించిన బార్ కౌన్సిల్.. సంబంధిత న్యాయవాదుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించింది. వారు చూపిస్తున్న సర్టిఫికెట్లకు సంబంధిచిన కాలేజీలు, యూనివర్సిటీలకు లేఖలు రాసింది. వాటి నుంచి వచ్చిన సమాచారంతో అవి నకిలీ సర్టిఫికెట్లుగా నిర్ధారించుకుంది. మొత్తం 15 మంది నకిలీ న్యాయవాదులను గుర్తించింది. దీంతో వీరిలో 8 మంది తమ ఎన్‌రోల్‌మెంట్‌ను సరెండర్ చేశారు. మిగతా ఏడుగురిపై బార్ కౌన్సిల్ సెక్రటరీ బి. పద్మలత ఇటీవల తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ నెల 11వ తేదీన వారిపై రెండు కేసులు నమోదు చేశారు. మొత్తంగా.. న్యాయవ్యవస్థలో నకిలీలు చొరబడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.. ఏ ఏ కోర్టుల్లో ఎంతమంది నకిలీలు ఉన్నారు.. నల్లకోటు మాటున ఉన్నది.. అసలు న్యాయవాదులా? నకిలీ న్యాయవాదులా? అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.