Buggana Rajendranath Satires On Chandrababu Naidu Pawan Kalyan: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయికపై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ, జనసేన మధ్య ఇప్పటిదాకా ఎన్నోసార్లు పెళ్లిళ్లు, విడాకులు అయ్యాయని సెటైర్లు వేశారు. ఆ రెండు పార్టీలు కలవడం, విడిపోవడం సాధారణం అయిపోయిందని పేర్కొన్నారు. టీడీపీ అయితే.. ఇప్పటివరకూ కలవని, పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ ఏదీ లేదని ఎద్దేవా చేశారు. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్‌తో తప్ప మిగతా పార్టీలతో టీడీపీతో పొత్తు పెట్టుకుందన్నారు. చంద్రబాబు పాలసీలో ఒక నిలకడ గానీ సిద్ధాంతం గానీ లేదని విమర్శించారు. ఒకే పార్టీతో ఎన్నిసార్లు కలుస్తారు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువల్ని ఏనాడు చంద్రబాబు పాటించలేదని అన్నారు. 2014 నుంచి అసెంబ్లీలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలు, వాడిన భాష రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఓపిక ఉండాలని.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికావని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్‌పై తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా.. మంత్రి బుగ్గన పై విధంగా టీడీపీ, జనసైనలపై వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, ఏపీ వాణిజ్య వ్యవస్థలో పునర్‌వ్యవస్థీకరణ చేశామని తెలిపారు. కమిటీ సమావేశంలో వ్యాపారాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించామని వెల్లడించారు. 2019లో ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 4వ స్థానంలో ఉందన్నారు. దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని.. రాష్ట్రానికి రూ.13,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాము తెచ్చిన అప్పుల వివరాలను ఏనాడూ దాచి పెట్టలేదన్నారు. కావాలంటే.. కాగ్, ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజాలు తెలుసుకోండని అన్నారు. ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల అసమానతలు వచ్చాయని.. వాటిని తొలగించడానికే అభివృద్ధి వికేంద్రీకరణ తెచ్చామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు.