దేశవ్యాప్తంగా ప్రజల జీవన విధానం మారుతోంది. ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఏపీలో అయితే భారీగా రక్తపోటు, మధుమేహం బాధితులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతి 100 మందిలో ఎవరో ఒకరు ఈ రెండింటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రాష్ట్రాల వారీగా ప్రజల ఆరోగ్య వివరాలను తెలపాలని కేంద్రం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు 30 ఏళ్లకు పైబడిన వారిలో రక్తపోటు, మధుమేహం గుర్తించేందుకు గ్లూకోమీటర్, బీపీ పరికరాలను సమకూర్చారు. ఈ మేరకు ఏపీలో 2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా 2,30,69,207 మంది 30 ఏళ్లు పైబడిన వారిని పరీక్షించారు. వీరిలో 19.11 లక్షల మంది రక్తపోటుతో.. 14.28 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1.52 లక్షల మంది రక్తపోటుతో, 1.44 లక్షల మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా స్పష్టమైంది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 53,043 మంది రక్తపోటు, 51,353 మంది షుగర్ బాధితులు ఉన్నారు. అయితే నిర్ధారణ పరీక్షలతో వీరిని మరోసారి పరీక్షించాలని కేంద్రం ఆదేశించడంతో అధికారులు తాజాగా మళ్లీ సర్వే చేపట్టారు.