ఏపీలో రేపు, ఎల్లుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నడ్డా పర్యటన ఏపీలో కచ్చితమైన మార్పుకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రోడ్ మ్యాప్‌ను ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతారని, 2024 ఎన్నికలకు దశాదిశా నిర్దేశం ఇస్తారని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు సన్నద్దం అయ్యేలా క్యాడర్‌ను సిద్ధం చేస్తారని, నడ్డా ఏపీ కార్యక్రమం ఖరారు కాగానే జగన్ డిల్లీ పర్యటన పెట్టుకున్నారన్నారు. ఇటువంటి డ్రామాలు జగన్ గతంలో కూడా ఆడారని, డైవర్ట్ పాలిటిక్స్ తో జగన్ మాయ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పొలిటికల్ మైండ్ గేమ్ ను వైసీపీ ప్రారంభించిందని, బీజేపీ పెద్దలతో వారు అన్నీ మాట్లాడినట్లు చెప్పుకుంటారని, కానీ ఆ వివరాలు ఏవీ కూడా మీడియాకు చెప్పరంటూ ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో బీజేపీపై జగన్ చేస్తున్న కుట్ర ఇదని, గతంలో టీడీపీ కూడా ఇలానే మాయ చేసిందని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు మాకు మద్దతు ఇచ్చే పార్టీలు చాలా ఉన్నాయన్నారు. అయినా వైసీపీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపతి అంశాన్ని తెర మీదకి తెస్తుందని, ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే జగన్ కి ఇచ్చారని, ఇప్పుడు జనసేన, బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా నిన్న స్పష్టంగా చెప్పేశారని, ఇంతకాలం తగ్గాం… ఇక తగ్గేదెలే అని తేల్చారన్నారు. ఎవరి కోసమో మేము పని చేయనక్కర్లేదని, త్యాగాలు చేయడానికి వారే సిద్దంగా ఉండాలన్నారు. గతంలో కూడా త్యాగాలకు సిద్దమని ప్రకటించారని, 2024లో బీజేపీ, జనసేన కలిసే అధికారంలోకి వస్తాయన్నారు.