BJP Leader Vishnuvardhan Reddy Makes Sensational Allegations On YSRCP: కాకినాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో బీజేపీ ప్రజాపోరు ప్రచార రథాన్ని తగలపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల కోసం కొందరు పోలీసులు ఐపీసీని వైసీపీగా మార్చారని ఆరోపించారు. ఆ ఘటనపై డీజీపీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీని నైతికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇలాంటి పిరికిపంద చర్యలతో ఎవ్వరూ ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. బీజేపీ సభలకు వస్తున్న వారికి సంక్షేమ పధకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని.. కొందరు పోలీసులు అనుసరిస్తున్న తీరు సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామతీర్థం, అంతర్వేది ఘటనల్లో నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. కానీ.. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా పోస్టులు పెడితే మాత్రం, వెంటనే అరెస్ట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని వైసీపీ గొప్పలు చెప్పుకుంటోందని.. అసలు మీ పాలనతో ఎవరు ఆనందంగా ఉన్నారని మీరు175 సీట్లు గెలుస్తారని అనుకుంటున్నారని ప్రశ్నించారు. పోలవరంకి నిధులు ఇవ్వడం లేదని చెప్తున్న దద్దమ్మలు.. 70 శాతం పని పూర్తయ్యిందని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. రైల్వే జోన్ ఇవ్వడం లేదని కూడా దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ యూనివర్శిటీకి పేరు మార్చాల్సిన అవసరం ఏంటని వైసీపీకి ప్రశ్న సంధించారు. ఇక టీడీపీకి ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు లేదని.. రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరా సాగర్ పోలవరం పేర్లు ఆ పార్టీ ఎందుకు మార్చిందని విష్ణువర్ధన్ రెడ్డి అడిగారు.