Vishnuvardhan Reddy: జనసేన, బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఇద్దరు బీజేపీ నేతల మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఒకరు పవన్ కల్యాణ్ ని అడిగినా సహకరించలేదని ఆరోపిస్తే.. పవన్ మద్దతు ప్రకటించారంటూ మరో నేత వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.. బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన-బీజేపీలనే ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని తెలిపారు విష్ణువర్ధన్‌రెడ్డి.. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే.. జాతీయ నాయకత్వంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుకోవచ్చు అని సలహా ఇచ్చారు.. అయితే, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థికి పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు.. కానీ, మాధవ్ ఏ ఉద్దేశ్యంతో ఆ కామెంట్లు చేశారో నాకు తెలియదని పేర్కొన్నారు.
Read Also: Janasena and BJP Alliance: జనసేన-బీజేపీ పొత్తు.. మాధవ్ సంచలన వ్యాఖ్యలు
కాగా, జనసేన-బీజేపీ పొత్తుపై బీజేపీ నేత మాధవ్ కీలక కామెంట్లు చేశారు.. గతంతో పోల్చుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందన్నారు.. విశాఖలో ఓట్ల శాతం తగ్గింది.. కానీ, మిగిలిన చోట్ల ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఇక, జనసేనతో కలిసి ఉన్నాం.. కానీ, కలిసున్నా లేనట్టేనని మేం భావిస్తున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవ్.. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని నమ్ముతారన్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదని ఆరోపించారు.. తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ చెప్పుకుంటుంటే.. ఆ విషయాన్ని ఖండించమని జనసేనను కోరినా ఖండించ లేదని విమర్శించారు. మాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదనేది మా ఆరోపణ అన్నారు. మరోవైపు, మేం వైసీపీతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు.. మేం బీజేపీ హైకమాండ్‌కు చెప్పే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని.. వైసీపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని భావిస్తున్నాం అన్నారు మాధవ్.