ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తగినంత స్థాయిలో ప్రభావితం చూపించలేకపోయింది.. చెల్లని ఓట్ల కంటే బీజేపీకి వచ్చిన ఓట్లే తక్కువ అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.. ఈ ఫలితాలపై విష్ణుకుమార్ రాజు లాంటి బీజేపీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో శాసన మండలి ఎన్నికల్లో ఐదు చోట్ల బీజేపీ, బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థులు పోటీ చేశారని తెలిపారు.. కానీ, వైసీపీ గెలిస్తే ఒక విధంగా, వేరే పార్టీవాళ్లు గెలిస్తే మరో విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొచ్చిన ఆయన.. 11.56 శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సాధించిందని తెలిపారు.. ఓట్లు తక్కువ వచ్చాయి.. దీనిపై సమీక్ష జరుపుతామని వెల్లడించారు. ఏపీలో జరిగిన ప్రతి ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది తప్ప వెనుకడుగు వేయలేదన్నారు.. ప్రజా తీర్పును ఒప్పుకుని సమీక్ష చేసుకుని ముందుకు వెళ్తామని ప్రకటించారు విష్ణువర్ధన్‌రెడ్డి.
Read Also: AP Assembly: అసెంబ్లీలో మళ్లీ సేమ్ సీన్..
మరోవైపు.. ఈ నెల 21 బెజవాడలో రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తామని.. జిల్లా బీజేపీ అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొంటారని.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీ లతో 220 మంది సభ్యుల వరకు పాల్గొంటారని తెలిపారు విష్ణువర్ధన్‌రెడ్డి.. బీజేపీ జాతీయ నేత శివ ప్రకాష్ ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి వస్తారు.. శాసన మండలి ఫలితాలు, ప్రజా ఉద్యమాలు, పార్టీ నిర్మాణం మీద చర్చ చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత పై ప్రజా ఉద్యమంపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో అకాల వర్షంతో పంట నష్టం ఎక్కువగా జరిగింది.. రాయలసీమలో వడగండ్ల వల్ల మామిడి అరటి చీలి టమోటా పంటలు 100 శాతం నష్ట పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.. 4 దశాబ్దాల కాలంలో వడగండ్ల వాన కురిసింది.. కోట్ల రూపాయల పంట నష్టం రైతులకు చేకూరింది.. ప్రభుత్వం నష్టపరిహారం అంచనా వేసి రైతుకు లక్ష రూపాయలు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టం కలిగినా న్యాయం చేయలేదు అని విమర్శించారు.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే ఏపీ బీజేపీ తరపున మేం కూడా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తాం అన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.