అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతూనే వున్నాయి. భారత్ బంద్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. విశాఖపట్నం పరిధిలోని రైల్వే స్టేషన్ ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. అనుమనితులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. రైళ్ల రాకపోకలు యధాతథంగా జరుగుతున్నాయి.
అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో వాల్తేర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. బైక్, కారు పార్కింగ్ అనుమతి నిరాకరించారు. అటు, పార్సిల్ సర్వీస్ కేంద్రం దగ్గర తనిఖీలు జరుగుతున్నాయి. ప్రజా రవాణాపై భారత్ బంద్ ప్రభావం అంతగా చూపించలేదు. నెల్లూరు జిల్లాలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. రైళ్లు..బస్సుల రాకపోకలు మామూలుగా కొనసాగుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తుల్ని సైతం అన్నీ తనిఖీలు చేసి పంపుతున్నారు. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమయిన భద్రత ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు.
తిరుపతి రైల్వే స్టేషన్ మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. విద్యార్థులు, ఆర్మీకి సెలక్ట్ కాదలచినవారు, విద్యార్థి సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు భారత్ బంద్ పేరిట హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు సిద్ధమయ్యారు పోలీసులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే కేసులు నమోదుచేస్తామని, భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలకు అవకాశం వుండదని హెచ్చరిస్తున్నారు. ఇటు విజయవాడలో కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసు అదనపు బలగాలు మోహరించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో పోలీసులు చేరుకున్నారు. భారత్ బంద్ పేరిట హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు.
Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్.. రైల్వేస్ హైఅలెర్ట్