మరికొద్దిరోజుల్లోనే ఐపీఎల్ సమరం ముగియనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులు ఏ మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మరో క్రికెట్ సమరం ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం పలికింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ లీగ్ జరగనుంది. ఈ విషయాన్ని ఏసీఏ కోశాధికారి ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి, ఏసీఏ సభ్యులు ప్రకటించారు.
జూన్ 22 నుంచి ప్రారంభం అయ్యే ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు ఏసీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఏసీఏ కోశాధికారి గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఈ టోర్నీ గ్రాండ్ సక్సెస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పురుషుల మ్యాచ్‌లు జూన్ 22 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని.. మహిళల మ్యాచ్‌లు జూన్ 28 నుంచి జూలై 3 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పురుషుల మ్యాచ్‌లన్నీ విశాఖ క్రికెట్ స్టేడియంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.