కొడుకు వారసుడు అవుతాడు.. అందుకే అంతిమ సంస్కారాలను కూడా కొడుకే చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.. కొడుకులుంటే కొడుకే చేస్తాడు.. లేనివారి పరిస్థితి ఏంటనేది ఎప్పుడు ఆలోచించలేదు.. అలాంటివి కూతుర్లు చెయ్యరు అని కొందరు అంటున్నారు.. వాటన్నిటిని పక్కన పెట్టి ఓ కూతురు తన తండ్రికి అంతిమసంస్కారాలను జరిపించింది.. ప్రతి దానిని దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించి తల కొరివి పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఆమెకు గ్రామస్తులు కూడా అండగా నిలిచారు..
ఈ ఘటన బాపట్ల జిల్లాలోని సోపిరాలలో చోటు చేసుకుంది.. ప్రపంచం టెక్నాలజీలో జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తున్నా సమాజంలో స్త్రీ, పురుష బేధభావాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు.. ఉద్యోగం.. టెక్నాలజీలో పురుషులకు ధీటుగా మహిళలు దూసుకుపోతున్నా.. పితృకర్మల విషయాల్లో స్త్రీలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. తల్లిదండ్రులు చనిపోతే కొడుకులే కర్మలు చేయాలి.. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహిస్తారు. కానీ.. ఈ రోజుల్లో కొందరు మహిళల్లో కూడా మార్పులు వస్తున్నాయి..
మగపిల్లలకు వారసత్వం ఇచ్చారు.. మాకు జీవితాన్ని ఇచ్చారు.. తల్లిదండ్రులకు ఇలాంటి రుణాన్ని తీర్చుకోవడం మా ధర్మం అంటూ అంతిమ సంస్కారాలను దగ్గరుండి చేస్తున్నారు.. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన తుమ్మలపెంట వెంకట్రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయత్రం మరణించాడు.. ఇతనికి కుమారులు లేరు. ఈ నేపథ్యంలో వెంకటరావు పెద్ద కుమార్తె అంజలి మంగళవారం పద్ధతి ప్రకారం కన్నతండ్రి అంత్యక్రియల ను నిర్వహించింది. వెంకటరావు అంతిమయాత్రకు ముందు నడవడమే కాకుండా చితికి కొరివి కూడా పెట్టి కన్న తండ్రి రుణం తీర్చుకుంది.. ఈ సంఘటన గ్రామస్తులను కలచివేసింది . అందరూ ఆమెకు తోడు నిలబడ్డారు. ఆమెను చూసిన వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు.. తండ్రికి ఏదైనా ఇచ్చినప్పుడు కాదు ఇలాంటివి చేసినప్పుడే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని, జీవితాన్ని ఇచ్చిన తండ్రికి ఇలా రుణం తీర్చుకోవడం పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు..