Suryalanka Beach Closed: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది.. అయితే, కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు సముద్ర స్నానాల కోసం బాపట్ల సూర్యలంక బీచ్‌కు తరలివచ్చే దృశ్యం ఈసారి కనిపించలేదు. మొంథా తుపాన్ ప్రభావంతో సముద్రంలో ప్రమాదకర గోతులు ఏర్పడటంతో అధికారులు ముందస్తు చర్యగా బీచ్‌ను మూసివేశారు. సాధారణంగా ఈ పుణ్యక్షేత్ర కాలంలో రెండు లక్షల మందికి పైగా భక్తులు సూర్యలంక సముద్రతీరంలో పుణ్యస్నానం ఆచరిస్తుంటారు. అయితే, ఈసారి భద్రతా కారణాలతో పోలీసులు సముద్ర స్నానాలకు అనుమతించలేదు.
Read Also: Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
జిల్లాలోని సూర్యలంక, ఓడరేవు, రామాపురం, పాండురంగాపురం బీచ్‌లలోకి భక్తులు, యాత్రికులు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. బీచ్‌లకు వెళ్లే రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. అధికారుల నిర్ణయం వల్ల ఈసారి బాపట్ల బీచ్‌లు ఖాళీగా, నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. సముద్రతీరంలో సాధారణంగా కనిపించే సందడి, భక్తి వాతావరణం కనిపించకపోవడంతో సూర్యలంక బీచ్ పూర్తిగా బోసిపోయింది.