కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే అన్నారు ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ. ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో కానీ.. మహూర్తబలం అంత గొప్పది.అందుకే 4 దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుంది.
40 ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడటం నిజంగా అద్భుతం.ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న టీడీపీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం.పుష్కరకాలం ఎన్టీఆర్ నాయకత్వంలో, గత 28ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సాధించిన విజయాలు అనన్యసామాన్యం.
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కొత్త శకం లిఖించింది.తెలుగుగంగ, హంద్రి-నీవా, గాలేరు-నగరి, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఆధునీకరణ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ఎత్తిపోతల పథకాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నపూర్ణ అయ్యాయంటే అదంతా తెలుగుదేశం ఘనతే. నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేయాలన్నారు. 40ఏళ్లే కాదు 400ఏళ్లయినా తెలుగుదేశంపార్టీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుంది. దుష్టశక్తులెన్ని ఆటంకాలు కల్పించినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతుందన్నారు బాలయ్య.