తెనాలి పెమ్మసాని థియేటర్‌లో నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, అందులోని లింగాన్ని మింగేసే రకమని మండిపడ్డారు. ‘‘ఒక్క ఛాన్స్ అంటే, ఒక్క తప్పిదం చేశారు, ఓటు వేశారు, ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి’’ అంటూ ఏపీ ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘దేశమంటే కట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని ఆనాడు గురజాడ అప్పారావు అన్నారు. కానీ, దానికి పూర్తి వ్యతిరేకంగా మన రాష్ట్ర పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఎక్కడో ఉన్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం? కాబట్టి మీరే ఆలోచించుకోండి’’ అని బాలయ్య అన్నారు.
తన తండ్రి ఎన్టీ రామారావు ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ ఉద్యోగం చేసి, సినీ రంగంలోకి ప్రవేశించి, తిరుగులేని మహానటుడిగా వేలాదిమంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని బాలయ్య అన్నారు. తెలుగువారికి ఏ ఆపద వచ్చినా ఆయన ముందుండేవారన్నారు. ఆనాడు సీమ ప్రజలు కరువుతో ఇబ్బంది పడుతున్న రోజుల్లో జోలి పట్టిన గొప్ప సంఘసంస్కర్త ఆయన అని బాలయ్య చెప్పారు. దివిసీమ ఉప్పెన సమయంలోనూ ప్రజల్ని ఆదుకున్నారని, దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికుల కోసం నిధి కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న రోజుల్లో.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, మడమ తిప్పకుండా పోరాడిన వ్యక్తి అని వెల్లడించారు.
తెలుగుదేశాన్ని స్థాపించి, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నిరూపించి, బడుగు – బలహీనుల్ని సైతం అధికారం పీఠంపై కూర్చొబెట్టిన మహానుభావుడు తారకరామావు అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదవాడికి ఇల్లు, ఇలా ఎన్నో సంస్కరణల్ని ఆయన ప్రశేశపెట్టారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి, ఓట్లు వేయాల్సిందిగా బాలయ్య కోరారు.