టీడీపీ మహానాడు వేదికపై వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ చేపడుతున్న బస్సు యాత్రలో వస్తోంది మంత్రులు కాదని.. అలీబాబా 40 దొంగలు అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులను ప్రజలు నిలదీయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారం అని తెలిపారు. ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలతోనే శిక్షలు విధించేలా న్యాయబద్దమైన, చట్టబద్దమైన అధికారాలు కల్పిస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలపై తప్పుడు కేసులను ఒక్క సంతకంతో ఎత్తేస్తామన్నారు.
చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు శపథం చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల కోసమే టీడీపీ రాజకీయం చేస్తుందని వివరించారు. గత మూడేళ్లుగా చంద్రబాబు మొదలుకుని సాధారణ కార్యకర్త వరకు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. వైసీపీలాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదన్నారు. టీడీపీ ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన పార్టీ అని అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. టీడీపీని లేకుండా చేయడం జగన్ వాళ్ల తాత, తండ్రి వల్ల కూడా కాలేదన్నారు. రోడ్డెక్కడానికి భయపడే పరిస్థితి నుంచి రోడ్డెక్కి పోరాటం చేసే స్థితికి కార్యకర్తలు చేరారని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి రాగానే ప్రభుత్వం షేక్ అయ్యిందన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల్లో మంచి స్పందన లభించిందన్నారు. ఉత్తరాంధ్రలోనే కాదు.. చంద్రబాబు కడప వెళ్తే అక్కడ జిల్లానే దద్దరిల్లిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.