అసని తీవ్ర తుఫాన్ బలహీనపడి తుఫాన్‌గా మారింది. దిశను మార్చుకున్న అసని మచిలీపట్నానికి 50కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతుండగా.. నర్సాపురం సమీపంలో తీరాన్ని తాకే అవకాశముంది. అనంతరం కాకినాడ దగ్గర సముద్రంలోకి వచ్చి బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుఫాన్ కారణంగా విశాఖకు రావాల్సిన, వెళ్లాల్సి ఉన్న అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. విశాఖ నుంచి బెంగళూరు, ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్ సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. అయితే సర్వీసులు కొనసాగుతాయో.. లేదో అన్న విషయంపై ఎయిరిండియా మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. సాయంత్రం వాతావరణం అనుకూలిస్తే యథావిధిగా విమానాల రాకపోకలు ఉంటాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కె.శ్రీనివాసరావు వెల్లడించారు.