బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న ‘అసని’ బలహీనపడుతున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈరోజు తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడి ఆ తర్వాత దిశ మార్చుకుంటుందని వెల్లడించింది. అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశా తీరం వెంట పయనించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర తీరానికి ముప్పు తప్పనుంది.
కాగా ప్రస్తుతం తీవ్ర తుఫాన్ అసని కదలికలను ఉత్తరాంధ్ర యంత్రాంగం నిశితంగా గమనిస్తోంది. ఈ మేరకు ఎల్లో వార్నింగ్ సందేశంతో ప్రజలను అలర్ట్ చేసింది. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైతే సహాయ చర్యలకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఫోన్ నంబర్: 0891- 2950100,0891-2950102. తుఫాన్ బలహీనపడే వరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలు జారీ చేశారు.
అటు తూ.గో. జిల్లాను అసని తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ నేపధ్యంలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ మాధవీలత ఆదేశాల మేరకు కలెక్టరేట్‌తోపాటు రెండు ఆర్డీవో కార్యాలయాలు, తీరప్రాంత మండలాల్లో తహసీల్దార్ ఆఫీసుల్లో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు 8977395609 నెంబరు కేటాయించారు.
మరోవైపు బంగాళాఖాతంలో అసాని తుపాన్ కారణంగా కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. 15-20 అడుగుల మేర అలలు ఎగసి పడుతున్నాయి. తుపాన్ కారణంగా ఇవాళ, రేపు తూ.గో. కోనసీమ, అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40కి.మీ- 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.
Cyclone Effect: రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అకాల వర్షాలు