డీజిల్ సెస్ పేరుతో నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణ దూరాన్ని బట్టి కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.140కి పైగా ఆర్టీసీ డీజిల్ సెస్ వసూలు చేయనుంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ల ప్రతిపాదికన మొత్తం ఛార్జీని నిర్ణయించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో కనీస ఛార్జీలను ఆర్టీసీ పెంచింది. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.5 మేర పెంచగా.. దూరప్రాంత, ఏసీ, నాన్ ఎసీ, స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.10 మేర పెంచింది. పల్లెవెలుగు,ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10 యథాతథంగా ఉంచింది.
కనీస ఛార్జీల పెంపుతో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.20గా, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.25గా, సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.40గా, ఇంద్ర బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50గా, గరుడ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50గా, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50గా, అమరావతి ఎసీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50గా, వెన్నెల స్లీపర్ బస్సుల్లోఇకపై కనీస ఛార్జీ రూ.80గా ఉండనున్నాయి.
Read Also: Plastic Ban: నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్.. లేదంటే ఐదేళ్ల జైలు శిక్ష
అటు ఆర్టీసీ ఛార్జీల పెంపుతో తిరుపతి-తిరుమల మధ్య తిరిగే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై రూ.15 అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఛార్జీ రూ.75 ఉండగా ఛార్జీల పెంపు కారణంగా రూ.90గా మారింది. అటు పిల్లల టికెట్ ధర రూ.45 నుంచి రూ.50కి పెరిగింది. రానుపోను టికెట్ ధర గతంలో రూ.135 ఉండగా ఇప్పుడు రూ.160కి పెరిగింది. 2018లో తిరుపతి నుంచి తిరుమలకు టికెట్ రూ.50గా ఉండేది. గత నాలుగేళ్లలో ఏకంగా రూ.40 పెరిగింది.