పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూలై 1 నుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లను వినియోగించరాదు. ఒకవేళ కేంద్రం నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. మున్సిపల్ చట్టాల ప్రకారం ఫైన్ కూడా విధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో గమనించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నేలనే కాకుండా సముద్ర జలాలను కూడా ప్లాస్టిక్ కలుషితం చేస్తోంది. అందుకే చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వివరించింది. భారత్‌లో ఏటా 41 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఈ వ్యర్థాల్లో 10-35 శాతం వాటా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌దే ఉంటోంది.
Read Also: Married Women: కొత్తగా పెళ్లి.. గూగుల్‌లో ఆ పని!
జూలై 1 నుంచి వాడకూడని ప్లాస్టిక్ వస్తువులు ఇవే..!!
ప్లాస్టిక్‌తో చేసిన ప్లేట్లు, గ్లాసులు, స్పూన్‌లు, కప్‌లు, స్ట్రాలు, ఫోర్క్‌లు, స్వీట్ బాక్స్‌లు, ఫుడ్ ప్యాకింగ్ కవర్లు, ప్లాస్టిక్ పుల్లల ఇయర్ బడ్స్, బెలూన్ల స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, చాక్లెట్ల స్టిక్స్, ఐస్‌క్రీమ్ పుల్లలు, థర్మకోల్, 100 మైక్రాన్లలోపు పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు.. ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటి నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్‌ను కచ్చితంగా అమలు చేసేలా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను నియమించనుంది. అక్రమంగా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటుంది.