రాష్ట్ర విభజన పై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ కామెంట్లపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ నేతలు. మోడీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. బీజేపీ పలాయన వాదానికి,పసలేని వాదనకు ఇది నిదర్శనం అన్నారు.
ప్రధాని మోడీ వైఖరి అత్త చచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినట్లుందన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలయింది. ఇప్పుడు ఏవిధంగా జరిగింది అని వివరించడం అప్రస్తుతం అన్నారు తులసిరెడ్డి. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా, బుందేల్ ఖంద్ తరహా ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్,కడప స్టీల్ ప్లాంట్,దుగరాజపట్నం ఓడ రేవు,విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించకుండా విభజన జరిగిన తీరు గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు.
విభజనకు కాంగ్రెస్ ఎంత కారణమో బీజీపీ కూడా అంతే కారణం అన్నారు తులసిరెడ్డి. మాట మీ పార్టీకి చెందిన చిన్నమ్మ (సుష్మా స్వరాజ్) నే చెప్పిందన్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి. మోడీ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.