ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జూన్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. 2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంఆ వేల మంది విద్యార్ధులు బీఈడీ, డీఈడీ పూర్తి చేసి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో టెట్‌లో మంచి స్కోర్ సాధించడం తప్పనిసరి.
జూన్ నెలలో టెట్ నిర్వహించిన అనంతరం ఏపీలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయనున్నట్లు ఇప్పటికే మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏపీలో సుమారు 6 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించి ఎస్‌జీటీల ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా తెలంగాణలో ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.