Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయం, అసెంబ్లీలోని ఉద్యోగులు అంతా కలిసి ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్‌గా ఉద్యోగులు ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ మాట్లాడుతూ… పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించింది. కనీసం సీపీఎస్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని తెలిపింది. ప్రభుత్వ తీరుతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని పేర్కొంది. 2022 మార్చి నుంచి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ప్రాన్ ఖాతాలో జమ కావడం లేదని.. దీనిపై ప్రభుత్వం ఆదాయపు పన్ను ఎలా చెల్లిస్తుందని ప్రశ్నించింది.
Read Also: Rare Disease: అరుదైన వ్యాధి.. ఈ వ్యక్తికి శరీరమంతా వెంట్రుకలే..!!
కేంద్ర ప్రభుత్వం పెంచిన ప్రభుత్వ వాటాను రాష్ట్రంలో అమలు చేయకపోవడం చాలా దారుణమని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే తేల్చి చెప్పామని.. రాజకీయ కారణాలతో అయినా ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సీపీఎస్‌లో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని.. వాళ్లకు వచ్చే రూ.1000-1500 పెన్షన్ డబ్బులు మందుల ఖర్చుకు కూడా సరిపోవడం లేదని.. ఎటువంటి ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం దుర్భరంగా తయారైందని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ సభ్యులు కోట్ల రాజేష్, అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు పూనుకున్నాయని గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయంగా ప్రశంసించారు.