వర్షం మాట వింటేనే ఏపీ వణికిపోతుంది. నిన్న మొన్నటి దాకా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణ హెచ్చరికలతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్టు తెలిపింది. ఈనెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో దక్షిణా కోస్తాంధ్రలో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కలువాయి మండల కేంద్రంలోని చెరువు వద్ద నీటిప్రవాహం ఎక్కువ కావడంతో సోమశిల దక్షిణ కాలువ హెడ్ రెగ్యూలేటర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలువకు గండి కొట్టి నది వైపు నీటిని మళ్లించారు. ఇదిలా ఉన్న ఉంటే మొన్న కురిసిన వర్షాల నుంచి పూర్తిగా తేరుకోక ముందే మరో వర్ష సూచన రావడంతో ఏపీ ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాలని ప్రజలు కోరుతున్నారు.