ఏపీలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేసేందుకు ఓకే చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాత కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తామని తెలిపింది. పెండింగ్ అంశాలను అభ్యంతరాల కమిటీకి పంపుతామని పేర్కొంది.
Read Also: అసలు ఎస్మా అంటే ఏంటి? ప్రభుత్వం ఎందుకు ప్రయోగిస్తుంది?
కాగా మరోవైపు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు కొనసాగుతున్నాయి. హెచ్‌ఆర్ఏ విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మంత్రుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘ నేతలు తిరస్కరించారు. ఉద్యోగ సంఘాల వైపు నుంచి హెచ్‌ఆర్ఏ స్లాబులను పీఆర్సీ సాధన సమితి ప్రతిపాదించింది. హెచ్ఆర్ఏ స్లాబులు 12 శాతంతో మొదలవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థాయిలో హెచ్‌ఆర్ఏ స్లాబ్ ఫిక్స్ చేయడం కష్టమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. మంత్రుల అభ్యర్ధనతో కొత్త ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తెచ్చాయి. 10, 12, 16 శాతాల మేర హెచ్‌ఆర్ఏ స్లాబులను ఫిక్స్ చేయాలని పీఆర్సీ సాధన సమితి విజ్ఞప్తి చేసింది. సెక్రటేరియేట్, హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్ఏ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రతిపాదించారు.