ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై రచ్చ కొనసాగుతూనే ఉంది.. సినిమా థియేటర్లపై దాడులు, నోటీసులు, సీజ్‌లు ఓవైపు కొనసాగితే.. మరోవైపు.. ఈ టికెట్ రేట్లతో థియేటర్లు నడపడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు.. ఈ నేపథ్యంలో.. సినీ హీరో నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ కాగా.. ఇవాళ నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని.. కిరాణా కొట్టుకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చినపుడు సినిమా వాళ్లు తమ పెట్టుబడులు కిరాణా కొట్లో పెట్టుకోవచ్చు కదా? అంటూ సెటైర్లు వేశారు.. సినిమా టికెట్ల రేట్లు ప్రభుత్వం ఎక్కడా తగ్గించలేదు.. గతంలో కొన్ని సినిమాలకు రేట్లు పెంచమని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకునేవారు అని.. మా ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఉండకూడదని జీవో ఇచ్చిందని.. కానీ, మేం రేట్లు ఎక్కడా తగ్గించలేదని స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమలోని కొందరు కోర్టు అనుమతితో అడ్డంగా దోచుకునే అవకాశం లేకుండా తమ ప్రభుత్వం చేసిందన్నారు మంత్రి కొడాలి నాని… సినిమా టికెట్ రేట్ తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టం అని చెబుతున్నారని మండిపడ్డ ఆయన.. ఎగ్జిబిటర్‌ను అడ్డం పెట్టుకుని సినిమా టికెట్ల విషయంలో కొంతమంది గేమ్ ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సినిమా టికెట్ల వ్యవహారంపై కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఛైర్మన్ గా 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా.. సినీ గోయెర్స్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్రతినిధులకు చోటు కల్పించారు. చైర్మన్‌తో సహా ఏడుగురు అధికారులు కాగా, ఒక ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్ తో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక ప్రతినిధితో కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. సినిమా టికెట్ల వ్యవహారంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూలంకషంగా ఈ కమిటీ చర్చించనుంది.