ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వాలంటీర్లకు క్లాస్ పీకారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాలంటీర్లను సన్మానించిన ధర్మాన … పనిలో పనిగా తన మనసులో ఉన్న ఆవేదనను వెళ్లగక్కారు. మాకు జగన్ ఉద్యోగాలిచ్చారు … మీరేంటి మధ్యలో అనేలా వాలంటీర్లు వ్యవహరించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం మనందరిదీ…మన నాయకుడు వైఎస్ .జగన్మోహన్ రెడ్డి అని మరోసారి గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు ,అధికారులందరూ మీ శ్రేయస్సు కోరిన వారేనని…మీరూ, మేమూ కలిసి పనిచేయాలని సూచించారు. వాలంటీర్లు వారి ఆలోచనలు రాజకీయ నాయకులు,అధికారులతో పంచుకుంటూ … గ్రామంలో ఏర్పడిన వ్యవస్థలతో కలిసి ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఓవైపు వాలంటీర్ల సేవలు అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్న వేళ కృష్ణదాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.