ఇటీవల గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రంలో రాజకీయంగా అగ్గి రాజుకుంటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరాలు చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తుండగా, వైసీపీ నేతలు అందుకు తగ్గ రీతిలోనే కౌంటర్స్ వేస్తున్నారు. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: TS Inter Exams: ఇంటర్ పరీక్షలు.. ఆ నిబంధన వర్తింపు
రేపల్లె ఘటన బాధితురాలికి న్యాయం చేయాలని చూస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని బీహార్‌తో పోలుస్తూ ప్రతిపక్షాలు దారుణంగా కామెంట్స్ చేస్తున్నాయని చెప్పిన సురేశ్.. మహిళలపై దాడుల విషయంలో రాజకీయాలు చేయకూడదని సూచించారు. ప్రభుత్వపరంగా బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నిందితులపై ఎస్పీ, ఎస్టీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. బాధితురాలు యర్రదొండపాలెం ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో, ఆమెను ఒంగోలు రిమ్స్‌కు తరలించారని వెల్లడించారు. అందులో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
కాగా.. అవనిగడ్డలో పని చేసేందుకు రేపల్లే రైల్వే స్టేషన్‌కు చేరుకున్న దంపతలిద్దరు, అక్కడి నుంచి బస్సులు లేవని తెలిసి స్టేషన్‌లోనే పడుకున్నారు. ఇది గమనించిన ముగ్గురు వ్యక్తులు, నిద్రిస్తున్న మహిళని పక్కకు లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన భర్తని విచక్షణారహితంగా కొట్టారు. వారిని ఎదుర్కోలేకపోయిన భర్త, వెంటనే 200 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే, అక్కడికి చేరుకునేలోపు ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకున్న పోలీసులు, నిందితుల్ని పట్టుకున్నారు.