ఏపీలో సంచలనం సృష్టించిన మూడు రాజధానుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు, ఇతరులు ఒకే రాజధాని కావాలని అది కూడా అమరావతే కావాలంటూ.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత అమరావతి ఒక్కటే రాజధాని అంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి రాజధాని వ్యవహారం కోర్టుకెక్కింది.
రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయటం లేదని వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు రైతులు. దీంతో నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే.. రైతుల తరపున కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను న్యాయవాది ఉన్నం మురళీధర్ వేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే రాజధాని తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని ఈ పిటిషన్‌లో రైతులు పేర్కొన్నారు. నిధులు లేవనే సాకుతో రాజధాని తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.