ఈ నెఖరులోగా పీఆర్సీ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని… వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలన్నది ఏపీ ప్రభుత్వం ఆలోచన అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వచ్చే నెలన్నరలోనే ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎంవో అధికారుల సమావేశం ముగిసింది.
అనంతరం సజ్జల మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ కార్యనిర్వాహకులుగా ఉద్యోగులు ఉన్నారని… వారి సంక్షేమం, భవిష్యత్తు, ఉద్యోగ భద్రతపై రెండు అడుగులు ముందే ఉండాలన్నది సీఎం విధానమన్నారు. ఉద్యోగులు తమ విధుల నిర్వహణ పట్ల సంతృప్తిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నామని ప్రకటించారు. రెండేళ్లుగా కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని.. ఉద్యోగుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్చలు కొనసాగుతాయని… అధికారంలోకి వచ్చాక వారం లోనే ఐఆర్ ను సీఎం ప్రకటించారని గుర్తు చేశారు.