AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. నిధుల దుర్వినియోగం, పక్కదారి పట్టిన నిధుల విషయమై లెక్కలు తీస్తోన్న గృహ నిర్మాణ శాఖ అధికారులు.. వేల కోట్ల రూపాయల మేర గృహ నిర్మాణ నిధుల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటున్నారు. నిధుల దారి మళ్లింపు జరిగిందని గుర్తించారు. కేంద్ర నిధుల్లో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక నిర్దారణ అయింది. గృహ నిర్మాణం కోసం ఇచ్చిన కేంద్ర నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని పేర్కొంటున్నారు. గృహ నిర్మాణ శాఖలో సుమారు రూ. 3183 కోట్ల మేర కేంద్ర నిధుల దుర్వినియోగమైనట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు.
అలాగే, పీఎంఏవై నిధులను పక్క దారి పట్టించిన జగన్ సర్కార్.. కేంద్ర స్కీంకు రూ. 1575 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల.. ఇళ్ల నిర్మాణ పథకాన్ని గందరగోళంలోకి గత సర్కార్ నెట్టేసిందని అధకారులు పేర్కొంటున్నారు. నిర్మించిన ఇళ్ల లెక్కలకి గత ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇచ్చినట్టు గుర్తించారు. 1, 32, 757 మేర ఇళ్లను నిర్మించకున్నా.. లెక్కల్లో చూపించి మభ్యపెట్టిందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అధికారులు అందించారు.