Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు విద్యాశాఖ కీలక సూచన చేసింది. ఆగస్టు 13న వర్కింగ్ డేగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13న రెండో శనివారం సెలవును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు స్కూళ్లలో డ్యాన్స్, మ్యూజిక్, ర్యాలీలు, పెయింటింగ్, గ్రూప్ డిస్కషన్స్, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి అప్‌లోడ్ చేయడం లాంటి కార్యక్రమాలు ఉంటాయని విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. అందుకే ఆగస్టు 13వ తేదీని వర్కింగ్ డేగా పేర్కొంటూ విద్యాశాఖ జీవో జారీ చేసింది.
►దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
►11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ సెకండ్ సాటర్ డే సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. pic.twitter.com/X9w5ZiJqhn— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) August 11, 2022
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా రెండో శనివారం సెలవును రద్దు చేసినట్లు తెలుస్తోంది. అటు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతాలాపన నిర్వహించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఆగస్టు 16న ఉదయం ప్రభుత్వం చెప్పిన సమయానికి ఎక్కడివారు అక్కడే ఉండి జాతీయ గీతాలాపన చేయాలని ఆదేశించింది. వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 5 కే రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.