రాష్ట్రంలో రానున్న రోజుల్లో వ్యవసాయరంగంలోని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలన్నారు ఏపీ సీఎం జగన్. అగ్రి ఇన్ ఫ్రా రంగంపై ఆయన సమీక్ష చేశారు. అగ్రి ఇన్‌ఫ్రా పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షిస్తూ కీలక సూచనలు చేశారు. వీటికి సంబంధించిన నిధుల సేకరణ, టై అప్‌లపై సమీక్షించారు.
ప్రభుత్వం దాదాపు రూ.16,320.83 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయలు కల్పించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా వాటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా రైతులకు అదనపు ఆదాయాలు లభించేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో కచ్చితంగా మార్పు కనిపించాలని జగన్ సూచించారు.
గోదాములు సహా అన్నిరకాల నిర్మాణాలు ఊపందుకోవాలన్నారు. ప్రపంచంలో ఇప్పుడు సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలద్వారా వచ్చిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఈ అవకాశాలను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఆర్బీకే స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం మీద ఒక కస్టం హైర్ సెంటర్ వుండాలన్నారు. వచ్చే ఏడాది నాటికి తీసుకు వచ్చేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. సేంద్రీయ, సహజ వ్యవసాయం చేయడానికి అవసరమైన యంత్రాలు, పరికరాలు ఆర్బీకేలో ఏర్పాటు చేయాలన్నారు. సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే వాటికి మంచి రేటు వచ్చేలా చూడాలని సూచించారు జగన్. అలాంటి ఉత్పత్తులు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేలా ఒక విధానం తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు.