ఏపీ ప్రభుత్వం పాలనలో మరో ముందడుగు వేసింది. సచివాలయాల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పోర్టల్ సాయంతో ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయని సీఎం జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేపట్టిన ఆయన పోర్టల్ ఏర్పాటుతో ప్రజలు స్వయంగా తమ అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చన్నారు. దీనికి ‘ఏపీ పోర్టల్ సేవా’ పేరును ఖరారు చేశారు.
Read Also: వైసీపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ నేత పురంధేశ్వరి
గ్రామ, సచివాలయాలకు సంబంధించిన పలు రకాల సేవలు ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అర్జీ పరిష్కారానికి సంబంధించి దరఖాస్తు ఎప్పుడు, ఏ అధికారి వద్ద ఏ దశలో ఉందన్న వివరాలను దరఖాస్తుదారుడికి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ రూపంలో ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చని సీఎం జగన్ సూచించారు. 2020 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు సచివాలయాల ద్వారా 3.47 కోట్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు అందాయని ఆయన తెలిపారు. మొత్తం 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు.