సింహపురి రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా వుంటాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (AnilKumar Yadav) ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి తన బలం, బలగం ఏంటో చూపించారు. అదే టైంలో తాజా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా తానేంటో నిరూపించుకున్నారు. ఇదిలా వుంటే నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నియోజకవర్గమైన సర్వేపల్లిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరు బహిరంగసభలో అనిల్ కుమార్ యాదవ్ ఎమోషనల్ అయ్యారు. తనకు ఎవరూ పోటీ కాదని.. తనకు తానే పోటీ అన్నారు అనిల్.. అంతే కాదు తన సభలో ఎక్కడా ప్రస్తుత మంత్రి కాకాణి ఫోటో పెట్టలేదు. కనీసం ఆయన పేరుని కూడా ప్రస్తావించలేదు అనిల్. అటు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (kakani Govardhan Reddy) కూడా సీనియర్లు.. జూనియర్లను కలుపుకు వెళ్తాను అంటూ వివాదం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరిలో ఎవరూ వెనక్కు తగ్గలేదు. ఒకే సమయంలో మంత్రి అనిల్ భారీ బహిరంగ సభతో తన సత్తా చాటితే.. మంత్రి కాకాణి భారీ ర్యాలీతో తన బలం చూపించారు.
Read Also:Jagan Cabinet: మంత్రుల శాఖలు మారతాయా?
మంత్రి నియోజకవర్గం సర్వేపల్లి గ్రామంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ కాన్వాయ్ తో వెళ్లారు. సర్వేపల్లిలో అనిల్ అనుచరులు బాణా సంచా కాల్చి నానా హడావిడి చేశారు. కార్యక్రమం అనంతరం అనిల్ కుమార్ నెల్లూరుకు వెళ్లారు. మంత్రి కాకాణి..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాకాణికి స్వాగతం పలుకుతూ నెల్లూరు సిటీ పరిధిలో వేసిన ఫ్లెక్సీలను తొలగించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లిలో మాజీ మంత్రి అనిల్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి కాకాణి తాజాగా తన స్వగ్రామమైన తోడేరులో పర్యటిస్తున్నారు. ఇద్దరి నేతల తీరుతో క్యాడర్ గందరగోళానికి గురవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.