అంగన్వాడీ పాల అక్రమరవాణా కేసులో 26 మంది అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. గతనెల 3వ తేదీన శ్రీకాకుళం భామిని మండలం బత్తిలిలో 1919 లీటర్ల పాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పాలు అక్రమ రవాణా చేస్తున్న వాహనం సీజ్ చేసి , ఐదుగురిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ పాల అక్రమరవాణా కేసులో 40 రోజుల పాటు పోలీసులు దర్యాప్తు కొనసాగించగా విచారణలో వీరఘట్టం, వంగర మండలాలకు చెందిన 28 మంది అంగన్వాడీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. 26 మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
అయితే వారికీ 14 రోజులు రిమాండ్ విధించి అంపోలులోని జిల్లా జైలుకు తరలించారు. మిగిలిన ఇద్దరులో ఒకరు గర్భిణీ కాగా మరొకరు పరారీలో ఉన్నారు. పాల అక్రమరవాణా కేసులో శాఖాపరమైన చర్యలు తీసుకున్న ఐసీడీఎస్ అధికారులు… 28 మంది అంగన్వాడీ కార్యకర్తలను విధుల నుంచి తొలగించారు. వీరఘట్టం సీడీపీవో బాలామణి, మరో ముగ్గురు సూపర్ వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. అయితే సీడీపీవో బాలామణి తమను అన్యాయంగా ఇరికించిందని ఆరోపిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు.