ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేయాలని నిరుద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. నిరుద్యోగుల ఆందోళనలకు విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాలలోని విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి ముందస్తుగా పలు చోట్ల విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
కాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఎన్నాళ్లు శిక్షణ పొందుతూ గడపాలని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం… పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు విడుదల కాలేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల భర్తీకి గత నెలలోనే నోటిఫికేషన్ విడుదల కావాలని.. ఇప్పటివరకు దాని గురించి ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.