ఆటో డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. విజయవాడ, విశాఖ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ 6, సీఎన్జీ, పెట్రోల్, ఎల్పీజీ, ఈవీ ఆటోల సంఖ్యపై పరిమితిని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రవాణాలో భాగంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోన్నది. గతంలో విజయవాడ నగరంలో 8,700 ఆటో రిక్షాలు, విశాఖలో 8,400 ఆటో రిక్షాలకు మాత్రమే అనుమతి ఉండేది.
Also Read:Bhatti Vikramarka: అగ్రికల్చర్ పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టము..
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సహా ఆటో రిక్షాలు పర్యావరణ అనుకూలంగా ఉండటం, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అడ్రస్ మార్పిడి, ఓనర్షిప్ బదిలీ చేసుకున్న పాత ఆటోలను మాత్రం విజయవాడ, విశాఖ నగరాల్లోకి అనుమతించబోమని రవాణాశాఖ స్పష్టం చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు.