Smart Meters for Agricultural Motors: స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేయొద్దు.. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయదారుల కోసమే స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం పెడుతోంది.. మార్చి నుంచి సెప్టెంబర్ లోపు టెండర్లు ఫైనల్ అవుతాయన్నారు.. రాష్ట్రంలో 18.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.. ఎంత విద్యుత్ వినియోగం, ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తోంది.. రైతుకు తెలియజేయటం కోసమే ఈ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. నాణ్యమైన విద్యుత్ డిస్కంల నుంచి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. DTR మీటర్ల ద్వారా, ఫీడర్ కు మీటర్ పెట్టడం ద్వారా రైతుకు ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది అనేది స్పష్టంగా చెప్పలేమని తెలిపారు.
Read Also: Minister RK Roja: రోజా టూరిస్టా..? టూరిజం మంత్రా..? అనే విమర్శలకు ఇదే నా సమాధానం..
అయితే, ప్రతి కనెక్షన్ కు మీటర్ ద్వారా మాత్రమే రైతుకు విద్యుత్ వినియోగం, ప్రభుత్వ సబ్సిడీ గురించి స్పష్టంగా తెలుస్తుందన్నారు విజయానంద్.. టెక్నాలజీ ద్వారా సంస్కరణల్లో భాగంగా మాత్రమే మీటర్లు పెడుతున్నాం.. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదని వ్యాఖ్యానించారు.. రైతులు కూడా మీటర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు.. 4 వేల కోట్లు ఖర్చు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 1600 కోట్లు గ్రాంటును కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అపోహలు కలిగించ వద్దు అని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం పైలెట్ ప్రాజెక్ట్ లో 83.16 శాతం మీటర్లు పని చేస్తున్నాయి.. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది.. కావున.. రాష్ట్రవ్యాప్తంగా క్రమంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ఉంటుందని తెలిపారు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్.