Andhra Pradesh Creates New Record In Liquor Sales During Sankranthi: సంక్రాంతి పండుగ పుణ్యమా అని.. ఏపీ ఖజానాకు మాంచి ‘కిక్’ అందింది. పండుగ సందర్భంగా రాష్ట్రంలో భారీగా అమ్మకాలు జరిగాయి. గత మూడు రోజుల్లో రూ. 213 కోట్ల మేర మద్యం అమ్ముడుపోయింది. పండుగ వాతావరణం కావడంతో మందుబాబులు మద్యం దుకాణాలపై దండయాత్ర చేశారు. 2.33 లక్షలకు పైగా లిక్కర్ కేసులు, 83 వేలకు పైగా బీర్ కేసులను తాగేశారు. అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 27.81 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలున్నాయి. ముఖ్యంగా.. కోడి పందాల శిబిరాల్లోకి మద్యం బాటిళ్లు భారీగా తరలించారని సమాచారం. తెలంగాణ నుంచి కూడా మద్యం భారీగా డంప్ అవుతోందని తెలిసింది. సంక్రాంతి సందర్భంగా ఇతర ప్రాంతాల్లో ఉండే ఏపీ వాసులంతా రాష్ట్రానికి తిరిగి రావడంతో.. మద్యాన్ని అత్యధికంగా సేవించారు. ఫలితంగా.. రాష్ట్ర ఖజానాకి భారీగా ఆదాయం వచ్చిపడింది.
Himaja: ఏడనుంచి వస్తున్నాయి రా అన్ని డబ్బులు.. కార్ల మీద కార్లు కొంటున్నారు
అంతకుముందు కొత్త సంవత్సరం సందర్భంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 127 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం దుకాణాలకు రాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు హోటళ్లు, బార్‌లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో.. సెలెబ్రేషన్స్ పేరుతో రాష్ట్ర ప్రజలు మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. అటు.. తెలంగాణ రాష్ట్రంలోనూ రికార్డ్ స్థాయిలో మద్యం అమ్ముడుపోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు, ఒంటి గంట వరకు బార్ షాపులకు అనుమతి ఇవ్వడంతో.. 215.74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తేలింది. ఒక్క హైదరాబాద్‌లోనే మద్యం ప్రియులు రూ.37.68 కోట్ల మద్యం తాగేశారు.