AP Assembly Sessions: మూడో రోజు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. విశాఖలో కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రశ్న వేయగా.. దానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ.. ధూళి కణాల పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నారు. పొల్యూషన్ తగ్గించడమే కాకుండా త్వరలోనే పొల్యూషన్ ఆడిట్ చేయిస్తామని పేర్కొన్నారు. ఇక, పోర్టుల్లో కొన్ని ప్రైవేట్ బెర్తులు పొల్యూషనుకు కారకాలుగా మారుతున్నాయని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. అలాగే, పొల్యూషన్ కారణంగా హిందూస్థాన్ గ్యాస్, ఎల్జీ పాలిమర్స్ వంటి పరిశ్రమలు మూతపడ్డాయని అనే విషయాన్ని ఎమ్మెల్యే గణబాబు చెప్పుకొచ్చారు. కాలుష్య కారక పదార్దాలన్నీ బహిరంగంగానే కన్పిస్తున్నాయి.. పొల్యూషన్ ఎంత మేర ఉందనే విషయం తెలుసుకోవడానికి ఎక్విప్మెంట్ పెట్టాలని కోరారు.
Read Also: MLA-Pregnant Womens: ఆసుపత్రిలో లేని వైద్యులు.. ఇద్దరు గర్భిణులకు పురుడు పోసిన ఎమ్మెల్యే!
ఇక, విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో 40 లక్షల మేర మొక్కలు నాటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలోకి ఎవరైనా వెళ్లి ఫిర్యాదులు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. సభ్యులు లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలే అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పుకొచ్చారు. త్వరలో విశాఖలో పర్యటించాలని అయ్యన్న కోరారు. తొందరలోనే విశాఖపట్నంలో పర్యటిస్తాను అని పవన్ చెప్పుకొచ్చారు. విశాఖలో జల, వాయు, శబ్ద కాలుష్యం తగ్గించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.